అన్ని రాష్ట్రాలు జులై 31లోగా అన్ని పరీక్షల ఫలితాలు వెల్లడించాలి - సుప్రీంకోర్టు ధర్మాసనం | ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నాం ఎంతో ఆచరణాత్మకంగా వ్యవహరించారు పరీక్షల రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 31లోగా ఫలితాలు వెల్లడిస్తాం సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే
అన్ని రాష్ట్రాలు జులై 31లోగా అన్ని పరీక్షల ఫలితాలు వెల్లడించాలి - సుప్రీంకోర్టు ధర్మాసనం
పది ఇంటర్ పరీక్షలను రద్దుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం ఎంతో ఆచరణాత్మకంగా వ్యవహరించిందని చెప్పింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ అంశంపై విచారణ కొనసాగించింది.
రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసిందని, అయితే న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి విన్నవించారు.
తాను ముఖ్యమంత్రితో చర్చించానని, ఆయన పరీక్షల రద్దుకు అంగీకరించారని తెలిపారు. ఈ విషయాన్ని గురువారం తాను ఏపీ ముఖ్యమంత్రితో చర్చించానని, పరీక్షలు రద్దుచేయాలనే ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ‘పరిస్థితిని పునఃపరిశీలించిన తర్వాత రాష్ట్రబోర్డు నిర్వహించదలచిన పరీక్షను రద్దుచేసినట్లు దవే తెలిపారు.
ఆ ప్రకటనను రికార్డు చేస్తున్నాం. అందువల్ల ఇక ఈ కేసులో ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం తెలిపింది. ‘హైపవర్ కమిటీని ఏర్పాటుచేసి, పది రోజుల్లో మార్కుల అంచనాకు విధివిధానాలు రూపొందిస్తారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటిస్తాం. అదే పరీక్షలు నిర్వహించి ఉంటే ఫలితాలు ఆగస్టులో వచ్చేవి.
దేశమంతా ఒకవైపు వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదేవైపు వెళ్తుంది’ అని దవే కోర్టుకు చెప్పారు. ‘మీరు ముందే వచ్చి ఉంటే బాగుండేది’ అని ఈ సందర్భంగా ధర్మాసనం దుష్యంత్ దవేతో వ్యాఖ్యానించింది. గురువారం జరిగిన చర్చను నివారించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ధర్మాసనం చెప్పింది సరైనదేనని, అనూహ్యమైనది ఏమైనా జరిగినా, అది తమ మనసులోనే ఉంటుందని దవే చెప్పారు. ‘అది ఏమాత్రం ఊహించలేనిది, కఠినమైనది’ అని ధర్మాసనం తెలిపింది.
అన్ని రాష్ట్రాల బోర్డులూ జులై 31లోగా ఫలితాలు ప్రకటించాలన్న తమ ఆదేశాలను మరోసారి చెబుతున్నామని న్యాయమూర్తులు అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన అంచనా వేయాలని తాము చెప్పబోమని, అయితే అన్ని రాష్ట్రాల బోర్డులూ పది రోజుల్లోగా ఒక విధానాన్ని రూపొందించుకోవాలని చెప్పారు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.