Monday, 21 June 2021

కరోనా పరిహారం సాధ్యం కాదు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

కరోనా పరిహారం సాధ్యం కాదు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం

కరోనా పరిహారం సాధ్యం కాదు ఇస్తే వైపరీత్యాల నిధులన్నీ దానికే సరిపోతాయి మహమ్మారి నియంత్రణకు మిగలవు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం


కరోనా పరిహారం సాధ్యం కాదు సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం


ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం కింద కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు 183 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. 




ప్రభుత్వాల ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయని, ఒకవేళ ఇలా మృతుల కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించాలంటే రాష్ట్రాల ప్రకృతి వైపరీత్య నిధులు పూర్తిగా దానికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. అంతిమంగా మంచి కన్నా చెడే జరుగుతుందని తెలిపింది. 

జాతీయ ప్రకృతి వైపరీత్య చట్టం కింద 2015 ఏప్రిల్‌ 8న కేంద్ర హోం శాఖ జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి ప్రతి బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ గౌరవ్‌కుమార్‌ బన్సల్‌ దావా వేశారు. దీనిపై కేంద్రం ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.


ఇతర వైపరీత్యాలతో పోల్చకూడదు


మహమ్మారి కారణంగా ఇప్పటికే 3.85 లక్షలమంది కన్నుమూశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాల్లో సంభవించిన మరణాలకంటే ఇవి చాలా ఎక్కువ. స్వల్ప సమయంలో దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు  పరిహారాలు అందిస్తుంటారు. కొవిడ్‌-19 అన్నది ప్రపంచాన్ని తాకిన మహమ్మారి. నెలలు, ఏళ్ల తరబడి కొనసాగిన ఇలాంటి మహమ్మారిలకు బాధితులుగా మిగిలిన కుటుంబాలకు పరిహారం చెల్లించిన చరిత్ర ఇదివరకెన్నడూలేదు. ఒక రోగంతో మరణించిన వారికి పరిహారం చెల్లించి మిగిలిన రోగాల కారణంగా మరణించిన వారికి కాదని చెప్పడం సరికాదు. వరదలు, భూకంపాలు, తుపాన్ల సమయంలో మాదిరి కాకుండా ప్రస్తుత మహమ్మారి నియంత్రణ కోసం పరీక్షలు, టీకాల రూపంలో ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు ఖర్చుచేశాయి. మున్ముందు ఇంకెంత ఖర్చు చేయాల్సి వస్తుందో తెలియదు. 

రాష్ట్రాల ప్రకృతి వైపరీత్యాల నిధికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.22,184 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. ఇప్పుడు చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తే మొత్తం బడ్జెట్‌ దీనికే సరిపోతుంది. కొవిడ్‌ నియంత్రణకు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు నిధులు సరిపోవు. కరోనా కారణంగా ఆదాయాలు తగ్గిన ప్రభుత్వాలపై మరింత భారం పడుతుంది. విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్‌ 12 ప్రకారం ‘కనీస ప్రామాణిక పరిహారం’ చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఇతరత్రా రూపాల్లో అంటే ఆరోగ్య సౌకర్యాలు, ఆహారం కల్పన వంటి చర్యల ద్వారా పౌరులకు సహాయం అందజేస్తున్నాం. కేవలం నగదు అందిస్తేనే సహాయం చేసినట్టన్న అభిప్రాయం సరికాదు. బాధిత కుటుంబాలకు తాత్కాలిక సాయం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని పిటిషన్‌దారుడు కోరారు. 

చట్టం ప్రకారం తప్పకుండా చెల్లించాల్సిన అవసరం లేనిదాన్నే తాత్కాలిక సాయం అంటారు. ఇది చట్టబద్ధమైన హక్కేమీ కాదు. చట్టబద్ధమైన అవసరం లేకపోవడంతో న్యాయస్థానాలు దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవు. చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించే అధికారం ‘నేషనల్‌ అథారిటీ’కే ఉంది. దాన్ని మార్చే ప్రయత్నాలు చేయకూడదు’’ అని వివరించింది.


మరణాలన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు


కరోనాతో ఎక్కడ చనిపోయినప్పటికీ, అన్నింటికీ మరణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని కేంద్రం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను పాటించని వైద్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దేశమంతటా ఒకే తరహా నిబంధనలు ఉండేలా చూస్తామని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో కరోనా కారణంగా జరిగిన వాస్తవ మరణాలకు, ప్రభుత్వ లెక్కలకు తేడాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ఈ హామీకి ప్రాధాన్యం ఏర్పడింది.


వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా


కొవిడ్‌ రోగులకు వైద్యసేవలు అందించే 22.12 లక్షల ఆరోగ్య సిబ్బందికి ప్రధాన మంత్రి గరీబ్‌కల్యాణ్‌ కార్యక్రమం కింద రూ.50 లక్షల వంతున బీమా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు దీని కింద 1,003 క్లెయిమ్‌లు రాగా, ఇప్పటివరకు 477 చెల్లించినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 79 మంది వైద్యసిబ్బంది మృతిచెందగా, 40 క్లెయిమ్‌లు చెల్లించామని, 21 కేసుల్లో పూర్తిగా డాక్యుమెంట్లు రాలేదని, 11 కేసుల్లో ప్రాథమిక సమాచారం అందిందని పేర్కొంది. 7 కేసులకు బీమా అర్హత లేదని తెలిపింది. తెలంగాణ నుంచి 49 క్లెయిమ్‌లు రాగా, 23 కేసుల్లో బీమా చెల్లించినట్లు పేర్కొంది. 8 కేసుల్లో పత్రాలు పూర్తిగా రాలేదని, 14 కేసుల్లో ప్రాథమిక సమాచారం మాత్రమే వచ్చిందని తెలిపింది. 4 కేసులకు బీమా చెల్లించే అర్హత లేదని వెల్లడించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.